శారీరక అందం కంటే... మానసిక అందం అసలైన అందం అని ఎంతో మంది చెబుతున్నా... సినీ, గ్లామర్ ఫీల్డులో ఉండే చాలా మంది ఇంకా ఇంకా అందంగా కనిపించాలని ఏవేవో సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. లేని అందాలు ఉన్నట్లుగా చూపించేందుకు ఈ రోజుల్లో లెక్కలేనన్ని సర్జరీలు వచ్చేశాయి. ఒక్కోసారి అవి బూమరాంగ్ అవుతున్నాయి. అందం పెంచకపోగా... ఉన్న అందాన్ని కూడా పోగొడుతున్నాయి. అలాంటి ఓ విషాద దారుణ ఘటన ఇది.
చైనా నటి, సింగర్ గావో లియూ తనకు జరిగిన దారుణాన్ని అందరికీ చెప్పి... అందర్నీ అలర్ట్ చేస్తోంది. ఈ బ్యూటీ తన ముక్కుకి సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఆల్రెడీ అందంగా ఉన్నా... ఇంకా అందాన్ని పెంచుకోవాలి అనుకుంది. గత సంవత్సరం అక్టోబర్లో తన ఫ్రెండ్ సజెషన్తో గువాంగ్జూలోని ఓ ప్లాస్టిక్ సర్జన్ని కలిసింది. ముక్కును మరింత సన్నగా చేయించుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. దాందేముంది... ఈజీ అన్నారు డాక్టర్లు. వెంటనే ఆస్పత్రిలో చేరింది.
డాక్టర్లు కాస్మొటిక్ సర్జరీ మొదలుపెట్టారు. ఏవేవో పరికరాలతో అదనంగా ఉన్న ముక్కు కణజాలాన్ని సన్నగా కట్ చేశారు. అది సరిగా చేయకపోవడంతో తేడా కొట్టింది. దాంతో... ముక్కు చివర భాగం నల్లగా అయిపోయింది. దాంతో ఆ డాక్టర్లు చేతులెత్తేశారు. తాము చేయగలిగింది ఏమీ లేదు అనేశారు. ఇప్పుడు ఆ నల్లదనం పోయేలా లేదు. అది పోవాలంటే మరో సర్జరీ చేయించుకోవాలట. అందుకు కనీసం సంవత్సరం ఆగాలని చెబుతున్నారు. అంటే ఆమె సంవత్సరం పాటూ సినిమాలు, షూటింగ్లకు దూరం కాక తప్పదన్నమాట.
తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ... సోషల్ మీడియాలో పంచుకుంది ఈ బ్యూటీ. ఎవరైనా సరే ఇలాంటివి చేయించుకోవాలనుకుంటే... అనుభవం ఉన్నవారి దగ్గరే చేయించుకోవాలని సూచించింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చైనాలో గూగుల్గా చెప్పుకునే వీబోలో... వెతికి మరీ ఈ ఫొటోలు చూస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో 50 లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఈ ఘటనను వాళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాస్మొటిక్ సర్జరీలపై కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు.