పాము కనిపించగానే కొంతమంది దాన్ని చంపేవరకు నిద్రపోరు. కానీ ఎక్కువ మంది దాన్ని చూడగానే భయపడి పరుగులు తీస్తారు. పొలంలోనో, ఇంటి ఆరు బయటో పాము కనిపిస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ జనసంచారం ఎక్కువగా ఉండే ఒక సూపర్ మార్కెట్‌లోకి వస్తే ఏం చేస్తారు. తప్పకుండా పరుగు తీయాల్సిందే. ఇదే చేసింది థాయ్లాండ్ కు చెందిన ఓ దుకాణం యజమాని. స్టోర్ లో తన పనిలో తాను చేసుకుంటున్న ఓ మహిళ.. అకస్మాత్తుగా పాము బయట నుంచి దుకాణంలోకి రావడం గమనించింది. ఇంకేముంది ఆమె అక్కడి నుంచి పరుగు తీసింది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భయంతో పరుగు..
ఈ సీసీటీవీ ఫుటేజీని గమనిస్తే.. ముందు ఓ మహిళ షాపులో తన డెస్క్ వద్ద కూర్చొని ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతలో ఏదో పనిమీద డోర్ వద్ద ఉన్న రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్లింది. అప్పటికే డోర్ ఓపెన్ చేసి ఉండగా.. అకస్మాత్తుగా ఓ పాము ప్రవేశ ద్వారం నుంచి షాపులోకి వస్తుంది. ఇది చూసిన ఆ మహిళ భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీసింది. తిరిగి చూడగానే పాము వేగంగా వెళ్లడం స్పష్టంగా గమనించిన ఆమె అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఈ సంఘటన జూన్ 8న థాయ్ లాండ్ లో చోన్ భూరి అనే పట్టణంలో చోటు చేసుకుంది. వైరల్ హాగ్ వారు ఈ వీడియోను యూట్యూబ్ లో షేర్ చేశారు. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ క్లిప్పింగ్‌ను 30 వేల మంది చూశారు. నెటిజన్లు ఈ వీడియోకు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు. వీడియో చూస్తుంటే చాలా భయమేస్తుంది అని నెటిజన్లు చెబుతున్నారు.
"ఇది (పాము) చాలా వేగంగా వెళ్తుంది.. చూస్తుంటే భయమేస్తుంది" అని ఒకరు కామెంట్ చేయగా.. "పాము ఏదైనా కొనుగోలు చేయాలని భావించింది కాబోలు" అని మరోకరు విభిన్నంగా స్పందించారు. "దుకాణం తలుపుపై ఓపెన్ సైన్ కు బదులు హెల్ప్ కావాలి అని రాసి ఉంటే బాగుండేది" అని ఇంకొకరు పోస్ట్ పెట్టారు.
థాయ్ లాండ్ లో ఇళ్లు, భవనాల్లోకి పాము రావడం సహజంగా జరుగుతుందట. కానీ ఇలా స్టోర్ లోనే పాము దర్శనమిచ్చింది. చుట్టూ గుట్టలు, పొదలు లేకుండా ఈ పాము ఎలా వచ్చిందో అని షాపు యజమాని ఆరా తీస్తుందట.