కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను కష్టాల్లోకి నెట్టింది. లాక్డౌన్ల కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు, పనులు కోల్పోయారు. దీంతో కుటుంబాలు ఇబ్బందుల్లో పడడంతో చాలా మంది విద్యార్థులు అందుబాటులో ఉన్న పనుల బాట పట్టారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి చేయూతనందించేందుకు వివిధ ఉపాధి మార్గాలను అనుసరిస్తున్నారు. ఒడిశాలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని పోషించేందుకు ఓ కాలేజీ అమ్మాయి జొమాటోలో డెలివరీ ఏజెంట్గా చేరింది. ప్రజలకు ఫుడ్ డెలీవరీ సేవలు అందిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఒడిశాలోని కటక్కు చెందిన విష్ణుప్రియ స్వైన్ 12వ తరగతి చదువుతోంది. ఆయన తండ్రి డ్రైవర్గా పని చేస్తూ ఇంత కాలం కుటుంబాన్ని పోషించారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన ఉద్యోగం అంతంత మాత్రంగా మారింది. వేతనం అందడం కష్టమైంది. దీంతో వారి కుటుంబం కష్టాల్లో కూరుకుపోయారు. పూటగడవడం కూడా కష్టమైంది. దీంతో ముగ్గురు కుమార్తెల్లో పెద్దదైన విష్ణుప్రియ ఓ నిర్ణయం తీసుకుంది. కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. జొమాటోలో డెలివరీ ఏజెంట్గా చేరింది.
“నేను పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పేదాన్ని. అయితే కరోనా కారణంగా క్లాస్లకు ఎవరూ రావడం లేదు. దీంతో మేం ఆర్థికంగా మరింత కష్టాల్లో పడ్డాం. సమస్యలు ఎదుర్కొన్నాం. అందుకే కుటుంబంతో పాటు నా చదువు కోసం జొమాటోలో చేరా” అని స్వైన్ చెప్పింది. 12వ తరగతికి చెందిన ఆన్లైన్ క్లాసులకు సైతం ఆమె హాజరవుతోంది. పాఠాలు వింటోంది. ఇలా చదువు, పని.. రెండూ చేస్తూ ముందుకు సాగుతోంది. ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా ఉన్న రోజుల్లో రాత్రి వేళల్లోనూ జొమాటో ద్వారా విష్ణుప్రియ ఫుడ్ డెలివరీ చేస్తోంది. విష్ణుప్రియ డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ పరిస్థితులు మాత్రం డెలివరీ గర్ల్ గా మార్చేశాయ్.
“మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నేను అందరి కంటే పెద్ద. మా నాన్నకు సాయంగా ఉండేందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఏ పనీ తక్కువ కాదు. కుటుంబం సంతోషంగా ఉండేందుకు, నా చెల్లెల్లు చదువు కొనసాగించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా”అని విష్ణుప్రియ చెప్పింది.
Odisha: Bishnupriya Swain, a student in Cuttack picked food delivery work after her father lost job amid pandemic
"I was taking tuitions.During COVID students weren't coming to class. We were facing financial issues. I joined Zomato to support my education&family,"she said y'day pic.twitter.com/TGfBPZDvZm
కాగా కరోనా కారణంగా చాలా చోట్ల రెస్టారెంట్లు పూర్తిస్థాయిలో నడవడం లేదు. దీంతో ఆన్లైన్ ఆర్డర్లు చాలా ఎక్కువయ్యాయి. మరోవైపు తమ డెలివరీ ఏజెంట్లు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జొమాటో మొదలుపెట్టింది, తొలుత ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోంది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో గీపేంద్ ఘోయల్ ట్విట్టర్లో వెల్లడించారు. మరోవైపు కరోనా క్లిష్టసమయంలో పని చేస్తున్నందుకు ఇన్సెంటివ్లను సైతం జొమాటో అందిస్తోంది.