నాసిక్ చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి శరీరం మొత్తం అయస్కాంతంలా మారింది. ఇంట్లో ఉన్న స్పూన్లు, ప్లేట్లు, నాణేలు అతడి శరీరానికి అంటుకోవడంతో సంబంధించి ఆయన ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై జిల్లా మెడికల్ అధికారులు స్పందించారు. సోనార్ తో మాట్లాడి రక్త నమూనాలు తీసుకున్నారు. తమ నివేదికను ప్రభుత్వానికి పంపించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే అతనికి ఇలా జరిగిందని ఆరోపిస్తున్నాప్పటికీ అది ఎంతవరకూ నిజం కాదని వైద్య అధికారులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని తెలిపింది. కరోనా టీకా తీసుకుంటే మనిషి శరీరం అయస్కాంతంలా మారుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.
టీకాల వల్ల మ్యాగ్నెటిక్ రియాక్షన్ రాదంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకటించింది. మరోవైపు వ్యాక్సిన్ లో మైక్రో చిప్స్ ఉన్నాయనే వాదనల్ని కూడా కొట్టిపారేసింది. కొంతమంది శరీరాలు ఒక్కోసారి అయస్కాంతంలా పనిచేస్తాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చూశాం. దేశవిదేశాల్లో ఇలాంటి వ్యక్తులున్నారు. కరోనా టీకాలకు శరీరంలో అయస్కాంత గుణానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అంతేకాకుండా కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గమని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని సీడీసీ పేర్కొంది. ఎవరూ ఎలాంటి అపోహలకు వెళ్లకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచించారు.