పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి చికిత్స కోసం వచ్చే కోవిడ్ రోగులకు ఇక్కడి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులు రెండు రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని డీఐజీ రంగనాథ్ తెలిపారు. తెలంగాణలో చికిత్స నిమిత్తం వచ్చే అంబులెన్స్‌లు, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో వచ్చే కోవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రుల నుంచి జారీ చేసిన లెటర్స్‌తో పాటు హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పలువురు కోవిడ్ రోగులు హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స పొందడానికి వచ్చే క్రమంలో సరిహద్దుల వద్ద అంబులెన్స్ లలో కాకుండా వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలోనూ వస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్ తో పాటు విధిగా కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడే పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వచ్చే కోవిడ్ రోగులు ఈ అంశాన్ని గుర్తించి తమకు సహకరించాలని కోరారు. పాసుల లేకుండా వచ్చి సరిహద్దుల్లో ఇబ్బందులు పడవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే వాహనాలను తెలంగాణలోకి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు హైదరాబాద్ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం విదివిధానాలు జారీ చేసింది. కొందరు రోగులు ఏ ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండా అంబులెన్సుల్లో పేషేంట్లను పెట్టుకుని తిరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే కోవిడ్ పేషేంట్ల ఆడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని నిబంధనను రూపొందించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. వాళ్లు 040-2465119, 9494438351 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. ఆస్పత్రి నుంచి అడ్మిషన్ ప్రపోజల్ లెటర్ ఉంటే, పేషేంట్ ను తీసుకు వచ్చేందుకు కంట్రోల్ రూమ్ అనుమతులు ఇవ్వనుంది.