ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో షారుఖ్ ఖాన్ తప్ప..మిగతా బ్యాట్స్ మన్ చేతులేత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ అంతగా ఆకట్టుకోలేదు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4 వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికి దీపక్ చాహర్ బౌలింగ్‌లో మయాంక్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. లేని పరుగు కోసం ప్రయత్నించిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(7 బంతుల్లో 5; ఫోర్) తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. చాహర్ వేసిన 2వ ఓవర్ ఐదో బంతిని గేల్.. బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడగా అవతిలి ఎండ్‌లో ఉన్న రాహుల్ లేని పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. జడేజా కళ్లు చెదిరే డైరెక్ట్ త్రో రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. డేంజర్ మ్యాన్ క్రిస్ గేల్‌ను(10 బంతుల్లో 10; 2 ఫోర్లు) దీపక్ చాహర్ బోల్తా కొట్టించాడు. చాహర్ బౌలింగ్‌లో జడేజా అద్భుతమైన డైవ్ క్యాచ్ అందుకోవడంతో గేల్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. 19 పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఆ జట్టు ఆఖరి గుర్తింపు పొందిన బ్యాట్స్‌మెన్ పూరన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాహర్... అంతుచిక్కని నకుల్ బంతులను సందిస్తూ పంజాబ్ వెన్నువిరిచాడు. అతని ధాటికి రాహుల్ సేన నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో షారుఖ్ ఖాన్ తన బ్యాట్ కు పని చెప్పడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది పంజాబ్. ఈ బ్యాట్స్ మన్ టెయిలండర్లతో కలిసి స్కోరును వంద పరుగులు దాటించాడు.
ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో చెన్నైదే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు మధ్య 23 మ్యాచ్ లు జరగగా..చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్ ల్లో నెగ్గగా.. పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ ల్లో విజయ కేతనం ఎగురవేసింది.