BANGLADESH CRICKET TEAM CREATED HISTORY IN ODI BANGLA WON 2ND ODI ON SRILANKA AND REACHED TOP IN SUPER LEAGUE POINTS TABLE JNK
Cricket : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. శ్రీలంకపై ఇదే తొలిసారి.. టేబుల్ టాపర్‌గా బంగ్లా జట్టు
బంగ్లాదేశ్ జట్టు సరికొత్త రికార్డు.. దానితో పాటు సూపర్ లీగ్‌లో అగ్రస్థానం (PC: ICC)
ఒకప్పుడు పసి కూనగా అభివర్ణించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇప్పుడు మేటి జట్లకు సమానంగా ఎదుగుతున్నది. సీనియర్, యువకులతో కూడిన బంగ్లా జట్టు అద్భుతాలు చేస్తున్నది. వన్డేల్లో శ్రీలంక జట్టుపై తొలి సారి సిరీస్ నెగ్గి రికార్డు సృష్టించింది.
బంగ్లాదేశ్ క్రికెట్ (Bangladesh) చరిత్రలో మంగళవారం అద్భుతం జరిగింది. ఢాకాలోని మీర్పూర్ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో (Srilanka) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 103 పరుగులు (డక్‌వర్త్ లూయీస్ పద్దతి)లో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ జట్టు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకున్నది. బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ చరిత్రలో (History) తొలి సారిగా శ్రీలంకపై వన్డే సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ ఇప్పటి వరకు టెస్ట్ హోదా కలిగిన పలు దేశాలపై వన్డే సిరీస్ (ODI Series) గెలుపొందింది. మంగళవారం నాటి మ్యాచ్ అనంతరం శ్రీలంకపై కూడా సిరీస్ గెలిచింది. అయితే ఇంకా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై మాత్రం బంగ్లా వన్డే సిరీస్ ఇంత వరకు గెలవలేదు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ విఫలమైనా.. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడికి మహ్మదుల్లా (41) మరో ఎండ్‌లో సపోర్ట్‌గా నిలిచాడు. టెయిలెండర్లు కూడా విఫలమయ్యారు. కేవలం ముష్ఫికర్ 127 బంతుల్లో 125 పరుగులతో చెలరేగిపోయాడు. అయితే అతడికి మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. టెయిలెండర్ల కూడా విఫలమవడంతో బంగ్లా జట్టు కేవలం 48.1 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
ఇక శ్రీలంక బ్యాటింగ్ చేసే సమయంలో పలు మార్లు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. దీంతో లంక టార్గెట్ 40 ఓవర్లలో 245 పరుగులుగా డక్‌వర్త్ లూయీస్ పద్దతితో డిసైడ్ చేశారు. కాగా శ్రీలంక బ్యాట్స్‌మాన్ ఎవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. ఓపెనర్ ధనుష్క గుణతిలక చేసిన 24 పరుగులే శ్రీలంక ఇన్నింగ్స్‌లో హయ్యెస్ట్ స్కోర్. మిగిలిన క్రికెటర్లు కేవలం 20 పరుగుల లోపే చేసి పెవీలియన్ చేరుకున్నారు. శ్రీలంక ఇన్నింగ్స్ మొత్తం నత్తనడకగా సాగింది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 40 ఓవర్లలో కేవలం 9 వికెట్లు కోల్పోయి కేవలం 141 పరుగులు మాత్రమే చేసింది. తస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్ చెరి మూడు వికెట్లు తీశారు. షకీబుల్ హసన్ 2 వికెట్లు, షోరిఫుల్ ఇస్లామ్ ఒక వికెట్ తీశారు. షకీబుల్ హసన్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లాబౌలర్ మష్రాఫే మోర్తాజా (269) సరసన చేరాడు. మరోవైపు మీర్పూర్ వేదిక 122 వికెట్లు తీసి ఒకే స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన వసీం అక్రమ్ (షార్జా స్టేడియంలో 122) సరసన నిలిచాడు.
(శ్రీలంక Vs బంగ్లాదేశ్ 2వ వన్డే మ్యాచ్ హైలైట్స్)
ఇక ఈ మ్యాచ్ గెలవడంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. బంగ్లాదేశ్ మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌లలో గెలుపొందింది. దీంతో 50 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నది. రెండవ స్థానంలో ఇంగ్లాండ్, మూడో స్థానంలో పాకిస్తాన్ జట్లు ఉన్నాయి.