రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఓట్ల లెక్కింపు ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీకి అందనంత ఎత్తులో టీఎంసీ నిలిచేలా కనిపిస్తోంది. అయితే వార్ వన్ సైడ్ అవుతుందని భావించిన తమిళనాడులో మాత్రం ఫలితాలు ఊహించని విధంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో విపక్ష డీంకే కూటమి మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే.. ఈసారి సులువుగా అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పాయి. జయలలిత లేని అన్నాడీఎంకే పార్టీ ప్రభావం భారీగా తగ్గుతుందని లెక్కలు వేశాయి. అయితే ఫలితాల సరళి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో గెలుపు కోసం కావాల్సింది 118 సీట్లు. ప్రస్తుతం డీఎంకే కూటమి 136 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. అన్నాడీఎంకే కూటమి 97 స్థానాల్లో ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే 136 సీట్లలో ముందంజలో ఉన్న డీఎంకే కూటమికి అధికారం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే పెద్దగా ప్రభావం చూపలేకపోతుందనే అంచనాలు మాత్రం నిజం కాలేదు. 96 సీట్లలో అన్నాడీఎంకే కూటమి ముందంజలో ఉండటంతో.. తమిళనాడులో వార్ వన్ సైడ్ కావడం లేదనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే హోరాహోరీ పోటీ ఉంటుందని భావించిన పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఏకపక్ష విజయం దిశగా సాగతుండగా.. తమిళనాడులో ఈజీ విక్టరీ సాధిస్తుందని అనుకున్న డీఎంకే కూటమికి విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది.