భార్యకు ఇష్టం లేని శృంగారం వైవాహిక అత్యాచారమే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ప్రతీకాత్మక చిత్రం

వివాహ బంధానికి సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో భర్త శృంగారంలో పాల్గొంటే అది వైవాహిక అత్యాచారం అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

  • Share this:
    వివాహ బంధానికి సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో భర్త శృంగారంలో పాల్గొంటే అది వైవాహిక అత్యాచారం అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ ఎ ముహమ్మద్ ముస్తాక్ మరియు జస్టిస్ కౌసర్ ఎడప్పగత్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జూలై 30న హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహం మరియు విడాకులు తప్పనిసరిగా లౌకిక చట్టం కింద ఉండాలని పేర్కొంది.అలాగే దేశంలోని వివాహ చట్టాన్ని పునశ్చరణ చేయడానికి సమయం ఆసన్నమైందని అభిప్రాయపడింది.

    ‘వైవాహిక అత్యాచారాన్ని శిక్షకు అర్హమైనదిగా చట్టంలో గుర్తించలేదు. అయితే విడాకులు మంజూరు చేయదగ్గ క్రూరత్వంగా దాన్ని పరిగణించడంలో కోర్టుకు అదేమీ అడ్డు కాబోదు. వైహహిక అత్యాచారం ఆధారంగా విడాకులు కోరడం సరైనదేనని మేం అభిప్రాయపడుతున్నాం’అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రూరత్వం కారణంగా విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు తీర్పుపై అతడు దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. అదే విధంగా వివాహ హక్కుల కోసం వేసిన మరో పిటిషన్‌ను కొట్టివేసింది.‘భార్య శరీరంపై తనకు పూర్తి హక్కులు ఉన్నట్టు భావించడం, ఆమెకు ఇష్టానికి విరుద్దంగా లైంగిక చర్యకు పాల్పడటం వైవాహిక అత్యాచారం తప్ప మరోకటి కాదు’అని కోర్టు పేర్కొంది.

    ఆధునిక సామాజిక న్యాయశాస్త్రంలో వివాహంలో భార్యభర్తలు సమాన భాగస్వాములుగా పరిగణించబడతారని, భర్తకు భార్య మీద ఎలాంటి పెత్తనం చేసే హక్కు లేదని కోర్టు తెలిపింది. ప్రస్తుత కేసులో డబ్బు, శృంగారంపై భర్తకు ఉన్న విపరీతమైన ఆశ వల్లే భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అతని ప్రవర్తనను సాధారణ వైవాహిక జీవితంలో భాగంగా పరిగణించలేమని తెలిపింది.

    ఇక, ఆ జంటకు 1995లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వృత్తి రీత్యా డాక్టర్ అయిన భర్త.. పెళ్లి సమయంలో భార్య తండ్రి నుంచి కట్నంగా భారీగా బంగారం, కారు, ఫ్లాట్ తీసుకన్నాట్టుగా కోర్టు గుర్తించింది. అయితే అతడు భార్యను డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూసినట్టుగా ఫ్యామిలీ కోర్టు గుర్తించింది. ఆమె వివాహ బంధాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు భరించింది. అయితే అతని క్రూరత్వం తట్టుకోలేని స్థాయికి చేరడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్టుగా కోర్టు గుర్తించింది.
    Published by:Sumanth Kanukula
    First published: