భారీ స్థాయిలో ఫ్రెషర్స్‌ని నియమించుకోవడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ విషయాన్ని కంపెనీలు అధికారికంగా ప్రకటించడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా ఉద్యోగాలు పోతున్నాయన్న వార్తలే ఎక్కువగా వింటున్నాం. ఇలాంటి టైమ్‌లో నిరుద్యోగులకు, ఫ్రెషర్స్‌కి బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి ఐటీ కంపెనీలు. వందల్లో కాదు వేలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి కంపెనీలు. దీంతో సాఫ్ట్‌వేర్‌కు డిమాండ్ పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌కు డిమాండ్ పెరిగిపోతుండటంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలకూ బిజినెస్ పెరుగుతోంది. ఫలితంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే భారతీయ ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించుకోబోతున్నాయి.
ఇన్ఫోసిస్ వచ్చే 12 నెలల్లో 25,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇవన్నీ ఫ్రెషర్స్ కోసం కేటాయించిన ఉద్యోగాలే. దీంతో క్యాంపస్ నియామకాల్లో 26 శాతం కవర్ అవుతుంది. గతేడాది కన్నా 20 శాతం అదనంగా నియామకాలు ఉండబోతున్నాయి. ఇన్ఫోసిస్ భర్తీ చేయబోయే 25,000 ఉద్యోగాల్లో 24,000 పోస్టులు భారతీయులకు కేటాయించినవే. భారతదేశంలోని ఇంజనీరింగ్ క్యాంపస్‌లలో వీరిని ఎంపిక చేయనుంది. మిగతా 1,000 మాత్రమే విదేశీయులకు కేటాయించింది ఐటీ కంపెనీ. గతేడాది ఇన్ఫోసిస్ భారతదేశంలో 19,000 మంది ఫ్రెషర్స్‌ని, 2,000 మంది విదేశీయుల్ని నియమించుకున్న సంగతి తెలిసిందే. అంటే మొత్తం 21,000 మందిని నియమించుకుంది. కానీ ఈసారి అదనంగా 4,000 మందిని నియమించుకోబోతోంది. ఇండియాలోనే అదనంగా 5,000 మందిని నియమిస్తోంది.
ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించింది. టీసీఎస్ గతేడాది కూడా 40,185 ఉద్యోగులను నియమించుకుంది. ఈసారి కూడా దాదాపు అంతే స్థాయిలో లేదా అంతకన్నా ఎక్కువ ఉద్యోగులను నియమించుకోబోతున్నట్టు ప్రకటించడం విశేషం. టీసీఎస్ గతేడాది మొత్తం 40,185 ఉద్యోగులను నియమించుకోగా అందులో దాదాపు సగం 19,388 ఉద్యోగులను నాలుగో త్రైమాసికంలో నియమించుకోవడం విశేషం. దీంతో టీసీఎస్‌లో పనిచేసే ఉద్యోగులు 4,88,649 సంఖ్యకు చేరుకున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య ఐదు లక్షలు దాటొచ్చు.
మరోవైపు హెచ్‌సీఎల్ 12,000 ఫ్రెషర్స్‌ని నియమించుకోనుంది. విప్రో కూడా దాదాపు ఇదే స్థాయిలో నియామకాలు చేపట్టనుంది. గతేడాది విప్రో 9,000 మంది ఫ్రెషర్స్‌కి అవకాశం కల్పించింది. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువమందిని నియమించుకుంటామని విప్రో ప్రకటించడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా జాబ్ మార్కెట్ అతలాకుతలం అవుతోంది. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా తమ జాబ్ ఉంటే చాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు నిరుద్యోగుల్లో సన్నగిల్లాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో ఫ్రెషర్స్‌కి తీపికబురు చెబుతున్నాయి ఐటీ కంపెనీలు. వందల్లో కాదు వేలల్లో ఫ్రెషర్స్‌ని నియమించుకోబోతున్నాయి. ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.