కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ అంతరాల కారణంగా గతేడాది నుంచి ఇప్పటివరకు దేశంలో నియామకాల ప్రక్రియ ఎలా ఉందనే విషయంపై ప్రముఖ ఆన్లైన్ జాబ్ పోర్టల్ ఇండీడ్ నివేదిక కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, 2021 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో హెల్త్ కేర్, ఈ–కామర్స్ రంగాల్లో నియామకాలు పెరిగాయి. ఇదే క్రమంలో టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో నియామకాలు ఘోరంగా పడిపోయాయి. వివిధ ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ నుంచి నియామకాల డేటా సేకరించి ఈ వివరాలను వెల్లడించారు. నివేదికలో పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే.. 2021 మొదటి త్రైమాసికంలో కరోనా ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ నెలవారీ నియామకాలు క్షీణించాయని తేలింది. దీనిపై ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ మాట్లాడుతూ ‘‘2021 జనవరి నెలలో 38 శాతం, ఫిబ్రవరిలో 31 శాతం, మార్చిలో 26 శాతం నియామకాలు జరిగాయి. కరోనా ప్రభావం తక్కువగా ఉండటంతో జనవరిలో 36 శాతంగా ఉన్న నియామకాలు జరగ్గా.. మార్చి నెలలో మాత్రం 26 శాతానికి పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కంపెనీలు పెట్టుకున్న టార్గెట్ అందుకోలేక పోయాయి. అయినప్పటికీ, ఫస్ట్ వేవ్తో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న నియామకాలు కాస్త ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు." అని ఆయన అన్నారు.
ఆ ఉద్యోగులకు బంపరాఫర్.. జాబ్ ఛేంజ్ అయితే 40 శాతం ఇంక్రిమెంట్.. వివరాలివే
వాల్యూవోక్స్ అనే సంస్థ 2021 మార్చి నెలలో మొత్తం 9 నగరాల్లో 500 మంది ఉద్యోగులు, 350 వ్యాపారాల నుంచి డేటా సేకరించి ఈ సర్వే నిర్వహించింది. కరోనా కారణంగా అన్ని రంగాలతో పోలిస్తే ట్రావెల్ /టూరిజం, హాస్పిటాలిటీ రంగం బాగా దెబ్బతింటున్నాయని ఈ సర్వేలో తేలింది.
బెంగళూరు మొదటి స్థానంలో..
వివిధ సంస్థలు జరిపిన నియామకాల్లో ఎక్కువ శాతం టీమ్ లీడ్, బిజినెస్ అనలిస్ట్, కంటెంట్ హెడ్, సర్వీస్ ఇంజనీర్ వంటి ఆపరేషనల్/ సపోర్ట్ రోల్స్ వంటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయని నివేదిక తేల్చింది. మొత్తం నియామకాల్లో ఈ పోస్టుల వాటానే 25 శాతం ఉందని నివేదిక పేర్కొంది. ఇక, ఈ పోస్టుల తర్వాత మొబైల్ యాప్ డెవలపర్, CAD / CAM ఇంజనీర్ వంటి సాంకేతిక టెక్నికల్ రోల్స్ 18 శాతం, డెలివరీ సిబ్బంది, ఎలక్ట్రీషియన్, ఐటిఐ ట్రైనీ వంటి బ్లూ కాలర్ జాబ్స్ వాటా 15 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ఇక అన్నింటిలో కెల్లా మేనేజ్మెంట్ రోల్స్ అత్యల్పంగా 3 శాతం నియామకాలను చూసిందని నివేదికలో తేలింది. కరోనా టైంలో ఎక్కువ నియామకాలు జరిపిన నగరాల జాబితా పరిశీలిస్తే.. బెంగళూరు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక, చెన్నై మాత్రం సాధారణ సమయంలో జరిపే నియామకాల కన్నా 35 శాతం తక్కువ నియామకాలు జరిపి ఇతర మెట్రో నగరాల కంటే వెనుకబడిపోయింది. ఇక, సర్వేలో పాల్గొన్న 61 శాతం మంది స్త్రీలు, 21 శాతం పురుషులు స్మాల్ అండ్ మీడియం బిజినెస్/ స్టార్టప్ కంపెనీల్లో పనిచేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. అయితే, ఆశ్చర్యకరంగా 38 శాతం మంది మాత్రమే మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసేందుకు మొగ్గుచూపారు.