నేటి యువత చిన్నచిన్న విషయాలను కూడా తట్టుకోలేకపోతోంది. తాము అనుకున్నది జరగకపోతే వెనుకా ముందు ఆలోచించడం లేదు. తాజాగా విశాఖపట్నంలో ఓ యువకుడు కుక్కు పిల్ల కొని ఇవ్వలేదని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన విషాదం నింపింది.
నేటి యువత మనసు చాలా సున్నితంగా ఉంటోంది. తల్లిదండ్రులు చేసే గారాబమో.. నేటి సమాజిక పరిస్థితులో.. లేక సోషల్ మీడియా ప్రభావమో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటున్నారు. అనుకున్నది జరగకపోతే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఏం కోరుకుంటున్నారో అది క్షణాల్లో జరిగిపోవాలి అనుకుంటున్నారు. లేదంటే కన్న తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో యువకుడు చేసిన పని.. ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. తనకు కుక్క పిల్ల కొనివ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ నగరానికి చెందిన 16 ఏళ్ల షణ్ముక వంశీకి ఆన్ లైన్ షాపింగ్ లో వస్తువులు చూడడం.. ఏదైనా నచ్చితే తల్లికి చెప్పి కొనిపించుకోవడం అలవాటు ఉంది. అయితే అతడికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో అతడు ఆన్ లైన్ లో కుక్కపిల్లల గురించి వెతకగా.. ఇటీవల 30 వేల రూపాయల విలువైన ఓ కుక్క పిల్లను చూసి కొనివ్వాలని తల్లిని కోరాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తల్లి ఏదో పని మీద బయటకు వెళ్లినప్పుడు.. తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి తలుపు తీసి చూసి ఒక్కసారి షాక్ లో ఉండిపోయారు. కొడుకు ఆత్మహత్యచేసుకోడాన్ని ఆమె ఊహించలేకపోయారు. దీంతో తన కొడుకును పట్టుకున్ని ఆమె రోధించిన తీరు అందరితో కంటతడి పెట్టించింది. చుట్టపక్కల వాళ్లు వచ్చి ధైర్యం చెప్పి యువకుడ్ని చికిత్స కోసం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు చనిపోయాడని వైద్యులు చెప్పడంతో వారంతా కన్నీరుమున్నీరు అయ్యారు..
ఇటీవల కాలంలో కుక్కకోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొన్న రాయగఢ్ జిల్లాలో పెంపుడు శునకంపై ఉన్న అతి ప్రేమ ఓ యువతిని ప్రాణాలు తీసుకునేలా చేసింది. తన పెంపుడు శునకం మరణించిన వార్త జీర్ణించుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల ప్రియాంశు సింగ్ పీజీ చదువుతోంది. మంగళవారం రాత్రి తన పెంపుడు శునకం మరణించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. శునకాన్ని ఖననం చేసిన ఆ తర్వాతి రోజు ఉదయాన్నే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆందోళనతో కుటుంబసభ్యులు ఆమె గదిలోకి వెళ్లి పరిశీలించగా ఓ లేఖ దొరికింది. అందులో ఆమె తనను తన శునకంతో పాటే ఖననం చేయాలని పేర్కొన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.