DISNEY CEO ANNOUNCED TO SHUTDOWN SOME SPORTS CHANNELS 100 TV CHANNELS TO SHUTDOWN IN SOUTH EAST ASIA JNK
Star Sports : స్పోర్ట్స్ చానల్స్ మూసేస్తున్నాం.. స్టార్ స్పోర్ట్స్ మాతృసంస్థ ప్రకటన
కీలక నిర్ణయం తీసుకున్న ది వాల్ట్ డిస్నీ కంపెనీ?
దేశంలో పాపులర్ క్రీడా చానల్స్ అయిన స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2లను మూసేసే అవకాశం ఉన్నది. మార్కెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొన్ని క్రీడా చానల్స్ షట్ డౌన్ చేస్తున్నట్లు డిస్నీ సంస్థ సీఈవో బాబ్ చపెక్ తెలిపారు.
ఇండియాలోనే కాకుండా ఏసియన్ కాంటినెంటల్‌లోనే అతి పెద్ద టీవీ చానల్స్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ వాల్ట్ డిస్నీ(The Walt Disney). ఈ సంస్థకు అనేక ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌తో పాటు క్రీడా చానల్స్ కూడా ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా కేబుల్ టీవీలో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని టీవీ చానల్స్ నష్టాల బాట పట్టాయి. అంతే కాకుండా వాటిని చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సౌత్ఈస్ట్ ఏసియా పరిధిలో దాదాపు 100 చానల్స్‌ను మూసేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో కీలకమైన 18 స్పోర్ట్స్ చానల్స్ కూడా ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్ (Star Sports), ఫాక్స్ స్పోర్ట్స్ (Fox Sports) వంటి పాపులర్ చానల్స్‌ను సౌత్ఈస్ట్ పరిధిలో షట్‌డౌన్ చేస్తున్నామని డిస్నీ సీఈవో బాబ్ చపెక్ వెల్లడించారు. '2020లో 30 టీవీ చానల్స్ బంద్ చేశాము.. ఈ ఏడాది సెప్టెంబర్ లోగా 100 టీవీ చానల్స్ మూసేయాలని నిర్ణయించుకున్నాము' అని బాబ్ ఒక మీడియా కాన్ఫరెన్స్‌లో తేల్చి చెప్పారు. ప్రస్తుతం రోజు రోజుకూ ప్రేక్షకుల చాయిస్ మారిపోతున్నాయి. టీవీల కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్ (డిస్నీ+ హాట్‌స్టార్)లో క్రీడలను చూసే వారి సంఖ్య పెరుగుతున్నది. అదే సమయంలో అనలాగ్ చానల్స్ కంటే హెచ్‌డీ చానల్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. కాబట్టి మా దగ్గర ఉన్న కంటెంట్‌ను డీస్నీ+లోకి తరలిస్తున్నాము అని బాబ్ చెప్పుకొచ్చారు. కేబుల్, డీటీహెచ్ ప్లేయర్స్ మధ్యలో లేకుండా డైరెక్ట్ వినియోగదారుని దగ్గరకే వెళ్లే అవకాశం ఉండటంతో మేమే ఆ బాటలోనే వెళ్లాలి అనుకుంటున్నట్లు బాబ్ చెప్పారు.
బాబ్ వ్యాఖ్యలు ప్రస్తుతం టీవీ రంగంలో ఆసక్తికరంగా మారాయి. అనలాగ్ చానల్స్ షట్‌డౌన్ చేస్తుండటంతో ఇండియా, హాంకాంగ్ సహా సౌత్ఈస్ట్ ఏసియా పరిధిలో అనేక క్రీడా చానల్స్ మూతపడనున్నాయి. వీటిలో చాలా పాపులర్ స్పోర్ట్స్ చానల్స్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, ఫాక్స్ స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్ 2, ఫాక్స్ స్పోర్ట్స్ 3 వంటి అనలాగ్ చానల్స్ ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు లోగా వీటిని షట్‌డౌన్ చేసి హెచ్‌డీ చానల్స్ మాత్రం కొనసాగించే అవకాశం ఉన్నది. అయితే డిస్నీకి చెందిన ఇతర చానల్స్ ఏమైనా ఇండియన్ మార్కెట్ నుంచి తొలగిస్తారా లేదా అనే విషయాన్ని మాత్రం బాబ్ చపెక్ వెల్లడించలేదు. 'మాకు వినోదం, క్రీడలకు సంబంధించి ఇండియా మార్కెట్ మిగిలిన వాటికంటే భిన్నమైనది. ఇక్కడ హాట్‌స్టార్ ద్వారా చాలా కంటెంట్ అందుబాటులో ఉంచాము. ఇక్కడ ధరలు ఒకేలా ఉండటానికి లేదు.' అని బాల్ అన్నారు. ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఉండే తక్కువ బ్యాండ్‌విడ్త్, ప్రాంతీయ భాషలను కూడా దృష్టిలో పెట్టుకొని తాము ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కాగా, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఇండియాలోని పలు భాషల్లో క్రీడా ప్రసారాలను చేస్తున్నది. బీసీసీఐ, ఐసీసీ, ఐపీఎల్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ కలిగి ఉన్నది. ఇవన్నీ భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే హక్కులే. రాబోయే 12 నెలల్లో ఈ హక్కుల కాల పరిమితి తీరిపోనున్నది. ఇప్పుడు చానల్స్ మూసేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్తగా ఆయా హక్కుల కోసం డిస్నీ సంస్థ తిరిగి బిడ్స్ వేస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు పోటీగా కేవలం సోనీ పిక్చర్స్ సంస్థ మాత్రమే స్పోర్ట్స్ చానల్స్ నడుపుతున్నది. రాబోయే రోజుల్లో ఈ రెండు సంస్థల మధ్య హక్కుల కోసం భారీ పోటీ నెలకొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.