GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వస్తోంది. విద్య బోధనలు ప్రస్తుతం వర్చువల్ విధానంలో సాగుతున్నాయి. విద్యార్థులకు పాఠ్యంశాలు మరింత సులభతరం చేయడంకు అత్యాధునిక సాంకేతిక అంశాలతో కూడిన పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి. ఐతే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రకమైన బోధన ఇప్పుడిప్పుడే అమలవుతోంది. విద్యార్థులకు తాను చెప్పే పాఠాలు సునాయాసంగా అర్ధమవ్వాలనే లక్ష్యంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వినూత్నంగా ఆలోచించాకు. ఆలోచన వచ్చిందే తడవుగా టెక్నికల్ అంశాల్లో పట్టుసాధించారు. అలాగే డిజిటల్ విధానంలో విద్యార్థులకు బోధించాలని భావించి ఆ దిశగా అడుగులు వేశారు. కార్పొరేట్ స్కూళ్లలో కూడా అమలుకాని రీతిలో డిజిటల్ బోధన ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. వినూత్న బోధనలో పేరొందిన ఆమకు ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. అమె ప్రతిభను, కృషిని గుర్తించిన కేంద్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.
అనంతపురం జిల్లా పాలసముద్రం జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న మంజుల... నూతన విద్యా భోధన విధానాన్నీ అలవర్చుకుని విద్యార్థులకు సులభతరంగా అర్థమైయే రీతిలో పాఠాలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దీక్ష యాప్ లో పాఠ్యంశాలు వీడియో, వర్క్ షీట్స్ లను నిరంతరం అప్ లోడ్ చేస్తూ.., స్టూడెంట్స్ కు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న విద్యాధాన్ వెబ్ సైట్ లో మంజుల రూపొందించిన వీడియోలు, వర్క్ షీట్స్లను ఉంచారు. విద్యార్థులకు ఓ పాఠ్యంశం అర్థంకాకపోతే వారికి విర్చువల్ గా పాఠాలను బోధిస్తున్నారు.
ఇక యూట్యూబ్ లోనూ సరళమైన విద్య బోధనకై కృషి చేస్తూ 'మై సైన్స్ క్లాస్ రూమ్' పేరుతో ఓ ఛానెల్ ను ప్రారంభించారు. తద్వారా విద్యార్థులు పదులసార్లు ఆ వీడియోలను చూసి పాఠ్యంశాలు అర్థం చేసుకొనేలా వీడియోలు రూపొందించి యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ లో విద్యార్థులకు చేరువ అయ్యేలా ఓ బ్లాగ్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. సైన్స్ సంగతులు బ్లాగ్ ద్వారా ప్లే అండ్ లెర్న్ పేరిట విద్యార్థులు ఇంటర్ నెట్ ద్వారా ఆడుకుంటూ నేర్చుకొనే అసైన్మెంట్స్, ఇంటరాక్టీవ్ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ల్యాప్ టాప్ లో పాఠాలు చెప్తున్న మంజుల (ఫైల్)
ఈమె రూపొందించే వీడియోలు తక్కువ డేటాతో డౌన్లోడ్ అయ్యేలా రూపొందించారు. ఇందుకు ఆమెను అభినందిస్తూ యూనిసెఫ్ ఇండియా తమ ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో పోస్టింగ్ పెట్టింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన దీక్ష యాప్ లో చురుకుగా విద్య బోధనలు వీడియోను రూపొంది శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించారు. ప్రభుత్వం ముద్రిస్తున్న పాఠ్యంశ పుస్తకాలలో నూతన ఒరవడి తీసుకురావడానికి తన వంతు సహకారం అందించారు. పాఠ్యపుస్తకాలలో క్యూఆర్కోడ్ కంటెంట్ రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎన్ఈసీఆర్టి వారి వెబ్ నెర్లో ఐటిసి టూల్స్ గురించి జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఆమె చేసిన కృషికి 2019లో రాష్ట్ర ప్రభుత్వ దీక్ష అవార్డు వరించింది. 2020 కొచ్చిన్లో జరిగిన ఐసీటీ మేళాలో బెస్ట్ న్యూమీడియా కంటెంట్ పురస్కారం అందుకున్నారు. తాజాగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఐసీటీ) అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు ద్వారా తన బాధ్యత ఇంకా పెరిగిందని, భవిష్య త్తులో మరింత సాంకేతికతను విద్యార్థులకు చేరువ చేసి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యార్థులు అంత వర్చువల్ విధానం ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచే అభ్యసనం కొనసాగించేలా.., గూగుల్ మీట్, గూగుల్ క్లాస్ రూమ్స్ వంటి డిజిటల్ యాప్స్ ద్వారా పాఠాలు చెబుతూ విద్యార్థుల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పాఠ్యాంశాలపై క్విజ్, టెస్టు మోజ్, వార్డ్ వాల్ వంటి యాప్ల ద్వారా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. కేజీబీవీల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం అనంతపురం యూట్యూబ్ ఛానల్ కు వీడియోలను రూపొందించారు.