
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 18:32 IST
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) తొలి సారిగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)ఫైనల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంగ్లాండ్‌లోని (England) సౌంతాప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఈ మ్యచ్ జరుగనున్నాయి. ఐసీసీ పాయింట్ల పట్టిక ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్ ఇండియా, న్యూజీలాండ్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. కాగా, తాజాగా బ్రిటన్ ప్రభుత్వం ఇండియాను 'రెడ్ లిస్ట్'లో పెట్టడంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్దం నెలకొన్నది. ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉండటం, ప్రతీ రోజు భారీ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదు అవుతుండటంతో బ్రిటన్ రెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఇండియా నుంచి ఎవరూ బ్రిటన్ రావొద్దని ఆంక్షలు విధించింది. ఒక వేళ బ్రిటన్ పౌరులు కనుక ఇండియా నుంచి తిరిగి వస్తే వారికి పది రోజుల కఠిన క్వారంటైన్ విధించనున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆంక్షలు ప్రతీ ఒక్కరు పాటించాల్సిందేనని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సరికొత్త కోవిడ్ ఆంక్షలు, రెడ్ లిస్ట్ నేపథ్యంలో ఐసీసీ అత్యవసరంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైంది.
ఐసీసీ, ఈసీబీతో పాటు ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. న్యూజీలాండ్ జట్టు ప్రయాణానికి ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే ఐపీఎల్‌లో ఆడుతున్న కివీస్ ఆటగాళ్లు, టీమ్ ఇండియా ఆటగాళ్లు బ్రిటన్‌లో అడుగుపెట్టడం కష్టమవుతుంది. పది రోజుల కఠిన క్వారంటైన్ వేరే దేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే. ఇండియా నుంచి ప్రయాణాలను బ్రిటన్ అంగీకరించడం లేదు. కాగా ఈ విషయంపై ఐసీసీకి ఈసీబీ భరోసా ఇచ్చింది. 'ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్ కోసం బయోబబుల్ ఏర్పాటు ప్రారంభమయ్యాయని ఈసీబీ చెప్పింది. ప్రయాణ ఆంక్షలపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని కూడా స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుపుతామని భరోసా ఇచ్చింది' అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఒకవైపు ఐసీసీ, ఈసీబీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై భరోసా ఇచ్చినా బీసీసీఐ మాత్రం భిన్నంగా స్పందించింది. జూన్ నాటికి పరిస్థితులను బట్టి డబ్ల్యూటీసీ ఫైనల్‌పై అంచనాకు వస్తామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అప్పటి కల్లా భారత్‌ను రెడ్ లిస్ట్ నుంచి తొలగిస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు.. కానీ కరోనా తీవ్రత పెరిగితే మాత్రం ఆటగాళ్లను పంపడం కూడా సాహసమే అవుతుందని సదరు అధికారి వ్యాఖ్యానించారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు విదేశీ ప్రయాణాలకు కూడా భారత ప్రభుత్వం అనుమతి కోరాల్సి ఉంటుంది. కాబట్టి జరుగుతున్న పరిణామాలను ప్రస్తుతం నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు.