
- News18 Telugu
- Last Updated: April 21, 2021, 14:53 IST
ఐపీఎల్ 2021 (IPL 2021) ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) అభిమానులు మంచి జోష్‌లో ఉండేవారు. మీమ్స్, స్టికర్స్, పోస్టర్లతో అదరగొట్టే వాళ్లు. ఈ సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (Kolkata Knight Riders) 10 పరుగుల తేడాతో ఓడిపోయినా.. సరే కష్టపడ్డారు కలసి రాలేదని తమను తాము ఓదార్చుకున్నారు. కానీ వరుసగా అతి స్వల్ప తేడాతో ఓడిపోతుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గల్లీ క్రికెట్‌లో కూడా ఇలా వికెట్లు పారేసుకోరంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చేతినిండా వికెట్లు, బంతులు ఉన్నా.. 20 నుంచి 30 పరుగులు కొట్టలేక అందరూ వరుసగా క్యూ కట్టడం సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌కే చెల్లింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో వికెట్లు తీస్తే చాలు మ్యాచ్ గెలిచినట్లే అని ప్రత్యర్థి జట్లు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. తాజాగా మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గెలిచింది. స్వల్ప స్కోర్‌ను చివరి వోవర్లో ఛేదించింది. దీనిపై కూడా సన్‌రైజర్స్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ.. మిడిల్ ఓవర్లలో తడబడింది. కానీ లలిత్ యాదవ్, హిట్‌మెయర్ క్రీజులో నిలబడి ఢిల్లీ జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు. అయితే ఈ విజయంపై సన్‌రైజర్స్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ ప్లేసులో మా సన్‌రైజర్స్ జట్టు ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేదని అంటున్నారు. చివర్లో పరుగులు తీయడం బదులు వికెట్లు పారేసుకునేవారంటూ ట్రోల్ చేస్తున్నారు. లలిత్ యాదవ్ లాగా నిలబడి పోరాడే ఒక్క యువ బ్యాట్స్‌మాన్ కూడా సన్‌రైజర్స్‌కి కూడా లేదని తిట్టిపోస్తున్నారు.
సన్‌రైజర్స్ జట్టు తొలి మ్యాచ్‌లో 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 10 పరుగుల దూరంలో ఆగిపోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివర్లో 7 వికెట్లు పారేసుకుంది. దీంతో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది.