
- News18 Telugu
- Last Updated: April 19, 2021, 13:14 IST
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఎవరు ఏ మతాన్ని ఆచరించినప్పటికీ అన్నదమ్ముల్లా కలసిమెలిసి ఉండటం భారతీయుల ఐకమత్యానికి నిదర్శనం. అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో మెలిగే దేశం భారతదేశం. పరమత సహనం భారతీయతకు మారుపేరు. అలాంటి మన దేశంలో అడుగుపెట్టిన వేళా విశేషమో, ఏమో గానీ ఐపీఎల్ టీమ్స్‌లో ఒకటైన హైదరాబాద్ సన్‌రైజర్స్ టీంలో ఇద్దరు ఆటగాళ్ల తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇతర మతాచారాలను, నియమనిష్టలను గౌరవించాలనే నిబంధనను తూచాతప్పకుండా పాటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. వారిలో ఒకరు న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్‌సన్ కాగా, మరొకరు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. ఈ ఇద్దరు క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాళ్లైన వీరు ఇతర మతాల ఆచారాలను గౌరవించడంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ జట్టులో ఉన్న రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, మహ్మద్ నబీ, ఖలీల్ అహ్మద్ రంజాన్ మాసం కావడంతో ఉపవాసం పాటిస్తున్నారు. అయితే.. వారి మతం కాకపోయినా వీళ్లతో కలిసి డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్ సన్ కూడా ఉపవాసం పాటించడం విశేషం. వారితో కలిసి ఈ ఇద్దరూ తినకుండా ఉపవాసం పాటించి ఉపవాసం పూర్తయిన తర్వాత తీసిన వీడియోను రషీద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు.
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలిసిందే. ఉపవాస సమయంలో మంచినీటిని కూడా స్వీకరించరు. ఉమ్మిని కూడా మింగరు. ఉపవాస సమయం పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకుంటారు. అలాంటి ఉపవాస దీక్షను జట్టులోని రషీద్ ఖాన్, ఇతర ఆటగాళ్లతో కలిసి వార్నర్, విలియమ్‌సన్ పాటిస్తుండటంపై నెటిజన్లు ఈ ఇద్దరు ఆటగాళ్లను ప్రశంసిస్తున్నారు. తామంతా ఒకటేనన్న స్పూర్తిని నింపేందుకు వార్నర్, విలియమ్‌సన్ ఉపవాస దీక్షను పాటిస్తుండటం శుభ పరిణామమని మెచ్చుకుంటున్నారు.
ఉపవాసం ముగిశాక రషీద్ ఖాన్‌తో పాటు కేన్, వార్నర్ ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇవాళ ఉపవాసం ఎలా ఉందంటూ రషీద్ ప్రశ్నించగా.. బాగుందని వార్నర్ సమాధానమిచ్చాడు. అయితే.. తనకు బాగా ఆకలిగా ఉందని, దాహం వేస్తోందని చెప్పాడు. కేన్ కూడా అదే సమాధానమిచ్చాడు. ఉపవాసం పాటించిన అనంతరం.. వార్నర్, కేన్ కొంత నీరసంగా కనిపించారు.