
- News18 Telugu
- Last Updated: April 11, 2021, 12:35 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (chandra babu naidu), జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (nara lokesh) లకు కేసులు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అధినేత చంద్రబాబు సహా చాలామందిపై వైసీపీ నేతలు వరసు కేసులు పెడుతున్నారు. ఈ కేసులతో టీడీపీ(telugud desam party) నేతలు ఊపిరి తీసుకునే విరామం కూడా ఉండడం లేదు. కీలక నేతలెవర్నీ ఈ కేసుల టెన్షన్ వదలడం లేదు. ఒక కేసులో రిలీఫ్ వచ్చింది అనుకునేలోపే మరోకేసు నమోదవుతోంది. ఇప్పటికే అమరావతి అసైన్డ్ భూముల (amaravati assigned lands) వ్యవహారంలో సీఐడీ కేసుల విషయంలో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా అధినేత చంద్రబాబు, అటు జాతీయ కార్యదర్శి లోకేష్ ఇద్దరి పైనా సైబర్ కేసు నమోదైంది.
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తిరుపతి ఉప ఎన్నిక (tirupati by poll) ప్రచారం హీటు పుట్టిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులూ వడ్డుతున్నాయి. ఎవరికి వారు గెలుపై లెక్కలు వేసుకుంటూ ప్రచారాన్ని కొత్త కొత్తగా పుంతలు తొక్కిస్తున్నారు. టీడీపీ ఈ ఎన్నికను డూ ఆర్ డై గా భావిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయాలు చవిచూసింది టీడీపీ. పరిషత్ ఎన్నికలను భహిష్కరిస్తున్నట్టు అధినేతే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే స్థానికంగా నేతలు ఎవరూ ఎన్నికల నుంచి తప్పుకోలేదు. పోటీ చేశారు. అయితే ఆ ఫలితాలపై టీడీపీ అధిష్టానానికి పెద్దగా నమ్మకం లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నికలో గెలుపొంది.. ఉనికి చాటుకోవాలని ఆరాటపడుతోంది. అందుకే చంద్రబాబు, తనయుడు లోకేష్ ఇద్దరూ అక్కడే ఉండి ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
తాజాగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరికి మరో షాక్ తగిలింది. ఇద్దరిపైనా సైబర్ కేసు ఒకటి నమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురు మూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకొని టీడీసీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు కట్టాలని వైసీపీ నేతలు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కోరారు. డీజీపీ ఆదేశాలతో వైసీపీ నేతల ఫిర్యాదును స్వీకరించి చంద్రబాబు, లోకేష్‌లపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదైంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్ ల ఫిర్యాదు ఆధారంగా విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు.