
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 22:05 IST
పూర్ణ ఓ మలయాళీ అని చాలా మందికి తెలియదు. తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ టీవీ తెరపై తన అందచందాలతో అలరిస్తూ ఉంటుంది. పూర్ణ నటించిన సినిమాల విషయానికి వస్తే ఆమె తెలుగులో ఎక్కువుగా దర్శకుడు రవిబాబు సినిమాల్లో నటించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, లడ్డుబాబు, అవును 2.. వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా పేరుతెచ్చుకుంది. ఇక ఆమె ప్రస్తుతం బ్యాక్ డోర్ అనే సినిమాలో నటిస్తోంది. పూర్ణ ఈ 'బ్యాక్ డోర్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. బ్యాక్ డోర్ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాలో పూర్ణకు జోడిగా తేజ నటిస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ అయ్యిన సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడారు. నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... "బ్యాక్ డోర్"లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయని పేర్కోన్నాడు. పూర్ణతోపాటు హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తామన్నాడు.
ఇక పూర్ణ ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా నటించిన పవర్ ప్లేలో నటించింది. ఈ సినిమాను విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూర్ణ విలన్‌గా నటించింది. పూర్ణ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో బాలయ్య సరసన ఓ సినిమాలో నటిస్తోంది. బోయపాటి దర్శకత్వంలో వస్తోన్న అఖండలో పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.