Andhra Pradesh: ఉత్కంఠ మధ్య.. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

AP MPTC ZPTC Elections: ఏపీ వ్యాప్తంగా మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 8 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీపడుతున్నారు.

Andhra Pradesh: ఉత్కంఠ మధ్య.. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

    ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల సిబ్బంది త్వరితగతిన బుధవారం పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు ఉత్కంఠ మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమయింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో పరిషత్ ఎన్నికల కోసం 27,752 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6,492 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో మొత్తం 247 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో భారీగా బలగాను మోహరించారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.

    ఏపీ వ్యాప్తంగా మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 8 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీపడుతున్నారు. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. మరో 735 స్థానాలకు పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 7,220 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 18,702 మంది పోటీలో ఉన్నారు.

    ఎన్నో హైడ్రామాల తర్వాత ఏపీలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సిన క్రమంలో.. మంగళవారం ఏపీహైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ ఉండాలని.. కానీ ఇక్కడ అలా విధించలేదని పిటిషనర్లు వివరించారు. అసలు 7 రోజుల్లో మొత్తం ప్రక్రియను ఎలా చేడతారని నిలదీశారు. పిిటిషనర్ల వాదనతో ఏకీభవించిన సింగిల్ బెంచ్.. ఎన్నికలపై స్టే విధించింది. ఐతే సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులపై ఎన్నికల సంఘం సవాల్ చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు డివిజినల్ బెంచ్.. బుధవారం పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈక్రమంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమయింది.

    Published by:Shiva Kumar Addula
    First published:April 08, 2021, 07:11 IST